: రూ. 251 అని చూపిన ఫోన్లను ను రూ. 3,600కు కొన్న రింగింగ్ బెల్స్
చీప్ గా పబ్లిసిటీని కోరుకున్నదో లేక సులువుగా మోసం చేసి ఉడాయించాలని భావించిందోగానీ, కేవలం రూ. 251కి అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ముందుకొచ్చి ఆపై చేతులెత్తేసిన రింగింగ్ బెల్స్ బాగోతాలు ఒక్కొక్కటే బయట పడుతున్నాయి. ఇప్పటికే అద్దె కూడా చెల్లించలేని స్థితిలో కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయిన సంస్థ, ఇటీవల అత్యంత ఆర్భాటంగా విడుదల చేసిన 'ఫ్రీడమ్ 251' ఫోన్లను యాడ్ కామ్ (అడ్వాంటేజ్ కంప్యూటర్స్) సంస్థ నుంచి ఒక్కొక్కటీ రూ. 3,600కు కొనుగోలు చేసిందట. ఈ విషయాన్ని యాడ్ కాం స్వయంగా వెల్లడించింది. వాస్తవానికి ఫోన్ విడుదలైన రోజునే దాని ప్యానల్ పై యాడ్ కాం లోగో కనిపించింది. ఆపై తాము శాంపిల్ పీస్ ను చూపామని రింగింగ్ బెల్స్ సమర్థించుకుంది కూడా. ఇప్పుడిక తమ వద్ద నుంచి ఫోన్లను కొనుగోలు చేసి వాటిని అతి తక్కువ ధరకు అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించనున్నట్టు యాడ్ కాం వ్యవస్థాపక చైర్మన్ సంజీవ్ భాటియా వెల్లడించారు. గతంలో తాము ఆ సంస్థకు ఫోన్లను విక్రయించామని, అయితే, వారు ఇలాంటి ప్రచారం కోసం వాటిని వినియోగిస్తారని తాము ఊహించలేదని అన్నారు. వారి ధర విధానం ఇంతవరకూ తమకు అర్థం కాలేదని భాటియా వ్యాఖ్యానించారు.