: లోదుస్తులు ఉతకట్లేదని మహిళా ఉద్యోగికి తమిళ జడ్జీ తాఖీదు!... సోషల్ మీడియాలో నోటీసులు వైరల్
తమిళనాడు న్యాయవ్యవస్థలో మరో కలకలం చోటుచేసుకుంది. తన లోదుస్తులు ఉతకడం లేదన్న ఆక్రోశంతో ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయమూర్తి తన కింద పనిచేసే సబార్డినేట్ కు ఏకంగా నోటీసులు జారీ చేశారు. సదరు నోటీసులకు వారంలోగా వివరణ ఇవ్వాలని కూడా ఆయన ఆ మహిళా ఉద్యోగికి హుకుం జారీ చేశారు. న్యాయమూర్తి జారీ చేసిన నోటీసుల కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వివరాల్లోకెళితే... తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం కోర్టులో డి.సెల్వమ్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. న్యాయమూర్తి ఇంటిలో పనిచేసేందుకు వాసంతి అనే మహిళా ఉద్యోగిని ప్రభుత్వం నియమించింది. విధి నిర్వహణలో అన్ని పనులు చక్కగా చేస్తున్న వాసంతి న్యాయమూర్తి లోదుస్తులు ఉతకడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. అంతేకాక వాటిని చూస్తేనే ఆమెకు చిర్రెత్తుకొస్తోందట. ఈ క్రమంలో ఆమె వాటిని అల్లంత దూరాన పారేస్తోంది. విషయాన్ని పసిగట్టిన న్యాయమూర్తి, ఆయన సతీమణి... వాసంతిని నిలదీస్తే, భవిష్యత్తులో ఇక తప్పు చేయనని ఒఫ్పుకుందట. అప్పటికి న్యాయమూర్తి శాంతించారు. అయితే తదనంతర కాలంలో వాసంతి న్యాయమూర్తి లోదుస్తులను ఉతకడంలో ఆసక్తి చూపలేదు. దీంతో మరోమారు చిర్రెత్తుకొచ్చిన న్యాయమూర్తి ఈసారి ఏకంగా నోటీసులు జారీ చేశారు. ‘‘లోదుస్తులు సరిగ్గా ఉతకడం లేదు. నీపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి’’ అంటూ గత నెల 1న జారీ చేసిన నోటీసుల్లో న్యాయమూర్తి వాసంతిని కోరారు. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై నిన్న ‘ద హిందూ’ పత్రికతో మాట్లాడిన వాసంతి... ఇంటి పనులు చక్కగా చేస్తున్నా, కేవలం గుడ్డలు ఉతకడం లేదని నోటీసులు జారీ చేశారంటూ వాపోయింది.