: రైతులకు బాబు సర్కారు బంపరాఫర్... ఎయిర్ పోర్టుకు భూములిస్తే, అమరావతిలో స్థలాలు!
విజయవాడ సమీపంలోని గన్నవరం ప్రాంత రైతులకు చంద్రబాబు నాయుడి సర్కారు బంపరాఫర్ ప్రకటించింది. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములను ఇచ్చే రైతులకు రాజధాని ప్రాంతంలో స్థలాలను ఇస్తామని ప్రకటించింది. ప్రతి ఎకరం భూమిని కోల్పోయిన వారికి 1,450 గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్టు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ జి. లక్ష్మీశ ఈ ఉదయం వెల్లడించారు. మొత్తం 1,229 ఎకరాలను సేకరించాల్సి వుందని, ఇప్పటివరకూ 30 ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నామని తెలిపారు. రైతులకు రాజధాని నివాస ప్రాంతంలో 1000 గజాలను, వాణిజ్య ప్రాంతంలో 450 గజాలను ఇస్తామని తెలిపారు. గన్నవరం, ఉంగుటూరు మండలాలకు చెందిన 11 గ్రామాల్లో భూసేకరణ జరపాల్సి వుందని, ముందుగా స్థలాలను అప్పగించిన వారికి ముందుగా అమరావతిలో స్థలాలు అప్పగిస్తామని తెలిపారు. గృహాలు కోల్పోయిన పక్షంలో 5 సెంట్ల స్థలంలో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని, అద్దెలకు ఉన్నవారికి వడ్డీ లేకుండా రూ. 25 లక్షల వరకూ రుణం ఇప్పిస్తామని వివరించారు. రైతులు ఎలాంటి అపోహలు లేకుండా ముందుకు రావచ్చని తెలిపారు.