: రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు!... అనారోగ్యంతో కన్నుమూసిన టీ కాంగ్ నేత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంరెడ్డి వెంకటరెడ్డి... ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్ లో మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన రాంరెడ్డి, టీఆర్ఎస్ వైపు వీచిన గాలిలోనూ విజయం సాధించి సత్తా చాటారు. టీ కాంగ్రెస్ కే చెందిన నేత (నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే) పి.కిష్టారెడ్డి హఠాన్మరణంతో అప్పటిదాకా తెలంగాణ ప్రజా పద్దుల కమిటీలో సభ్యుడిగా ఉన్న రాంరెడ్డి, ఆ తర్వాత పీఏసీ చైర్మన్ గా నియమితులయ్యారు. కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన రాంరెడ్డి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడిందన్న వార్తలు జనాన్ని చేరేలోగానే మళ్లీ ఆరోగ్యం విషమించడంతో రాంరెడ్డి కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలోనే కన్నుమూశారు.