: కాపులను అడ్డుపెట్టుకుని ఈ ముద్ద'రగడ' ఏంటి?: బొండా ఉమ
ఈ ఉదయం కాపు నేత ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత బొండా ఉమ తీవ్రంగా స్పందించారు. కాపులను అడ్డుపెట్టుకుని ముద్రగడ తన పబ్బం గడుపుకోవాలని చూస్తూ, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. కాపు గర్జన పెట్టి, కాపులను అల్లరి మూకలుగా చిత్రీకరించాడని, కాపు యువత ఈ కుట్రను తెలుసుకోవాలని కోరారు. వైఎస్ తనకు దేవుడని చెప్పే ముద్రగడ, జగన్ తో తనకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడని... అంటే, తండ్రి దేవుడు, కొడుకు రాక్షసుడా? అన్న విషయం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు గతంలో ఏ పార్టీ పదవులు ఇచ్చిందో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఒక్క టీడీపీ మాత్రమే ఆయనకు మంత్రి పదవులు ఇచ్చిందని అన్నారు. పదవులు ఈ పార్టీలో అనుభవించి, వైఎస్ ను దేవుడంటుంటే, ముద్రగడ నైజం ఎలాంటిదో ప్రజలకు, కాపులకు ఇప్పుడు అర్థం అవుతోందని అన్నారు. ప్రస్తుతం ముద్రగడ వెనుక కచ్చితంగా జగన్ ఉన్నాడని, ఆయన మాటల్లో ఈ విషయం తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఎవరి ప్రయోజనాల కోసమో కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని ఆయన హితవు పలికారు.