: ల్యాండింగ్ గేర్ పనిచేయని జెట్ ఎయిర్ వేస్ విమానం... బతుకుజీవుడా అనుకున్న 127 మంది!
అది న్యూఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్ విమానం 9డబ్ల్యు 354. అందులో 127 మంది ఉన్నారు. విమానం ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చిన వేళ ల్యాండింగ్ గేరు పనిచేయలేదు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రధాన ల్యాండింగ్ గేరు పూర్తిగా తెరచుకోలేదు. దీంతో విమానాశ్రయ అధికారులకు విషయం తెలిపిన పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకే నిర్ణయించుకున్నాడు. వెంటనే ఓ రన్ వేను మూసేసి జెట్ ఎయిర్ వేస్ విమానానికి లైన్ క్లియర్ చేసి సహాయక సిబ్బందిని, అంబులెన్స్, ఫైరింజన్ లను అధికారులు సిద్ధం చేశారు. ఆపై సగం తెరచుకున్న చక్రాలపైనే విమానం సురక్షితంగా ల్యాండ్ అయి రన్ వే మధ్యలో నిలబడి పోయింది. వెంటనే అత్యవసర ద్వారాలను తెరచి ప్రయాణికులను బయటకు తీసుకురాగా, 127 మంది బతుకుజీవుడా అని బయటపడ్డారు. బోయింగ్ 737 రకానికి చెందిన విమానాన్ని రన్ వే పై నుంచి పక్కకు తప్పించామని, దీన్ని నిపుణులు పరిశీలిస్తున్నారని జెట్ ఎయిర్ వేస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.