: ఆర్మీకి షాక్... కాశ్మీర్ సరిహద్దులో వెలుగులోకి వచ్చిన రహస్య సొరంగం
జమ్మూకాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఓ రహస్య సొరంగం బయటపడటంతో ఆర్మీ దిగ్భ్రాంతికి గురైంది. సరిహద్దులను దాటి ఇండియాలోకి ఉగ్రవాదులు సులువుగా ప్రవేశించేందుకు దీన్ని తవ్వి ఉండవచ్చని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. భూమికి 10 అడుగుల కింద ఈ సొరంగం ఉంది. 30 అడుగులకు పైగా పొడవైన ఈ సొరంగం విశాలంగా ఉంది. నిమిషాల్లో వందల మంది సరిహద్దులు దాటేందుకు వీలుండేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి అధునాతన ఆయుధాన్నైనా ఈ సొరంగం ద్వారా సరిహద్దులను దాటించవచ్చు. అయితే, ఈ సొరంగ నిర్మాణం పూర్తి కాకుండానే తాము గుర్తించగలిగామని, దీంతో జమ్మూ నగరంలోకి ఉగ్రవాదులు రాకుండా అడ్డుకున్నామని జమ్మూ రేంజ్ బీఎస్ఎఫ్ ఐజీ రాకేష్ శర్మ తెలిపారు. సొరంగం పనులు మరికొన్ని రోజులు సాగితే పాక్ వైపు కూడా పూర్తయి ఉండేదని అన్నారు. కాగా, భారత్, పాక్ సరిహద్దుల్లో సొరంగాలు బయటపడటం ఇదే తొలిసారి కాదు. అఖ్ నూర్ సెక్టారులో 2009లో, సాంబా సెక్టారులో 2012లోనూ ఇలాగే సొరంగాలు వెలుగులోకి వచ్చాయి. సొరంగం విషయమై పాక్ రేంజర్లకు నిరసన తెలిపామని, విచారణ జరుపుతున్నామని రాకేష్ శర్మ తెలిపారు.