: ఇనార్బిట్ మాల్ లో బీటెక్ స్టూడెంట్స్ చేతివాటం... ఖరీదైన ర్యాడో వాచీల చోరీ, అరెస్ట్ చేసిన పోలీసులు
వారిద్దరూ బీటెక్ విద్యార్థులు. మరికొన్ని రోజుల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఇంజినీర్లుగా ఉజ్వల కెరీర్ ను ప్రారంభించాల్సి ఉంది. అయితే జల్సాలకు అలవాటు పడ్డ ఆ విద్యార్థుల బుద్ధి వక్రమార్గం పట్టింది. హైదరాబాదులో ఖరీదైన వస్తువుల విక్రయ కేంద్రంగా పేరుగాంచిన మాదాపూర్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ పై వారి కన్ను పడింది. ఇంకేముంది, నీటుగా తయారై మాల్ లో వాలిపోయారు. అక్కడి ర్యాడో షోరూంలోకి దూరారు. ఖరీదైన వాచీలను కొనుగోలు చేస్తున్నట్లు నటించి గుట్టు చప్పుడు కాకుండా రూ.1.21 లక్షల ఖరీదు చేసే వాచీలను జేబులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు తమ పని తాము చేసుకుపోయాయి. షోరూం సిబ్బంది కళ్లుగప్పి విద్యార్థులు వాచీలు తస్కరించిన దృశ్యాలను కెమెరాలు రికార్డు చేశాయి. వీటిని పరిశీలించిన షోరూం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. విచారణలో వారిద్దరి పేర్లు తేజ, సహాస్ చౌదరిగా తేలింది. అంతేకాక వారిద్దరూ బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది.