: కిర్లంపూడిలో మరికాసేపట్లో మీడియా సమావేశం... భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న ముద్రగడ


తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మరికాసేపట్లో మీడియా ప్రతినిధులు, వీడియో కెమెరాలతో పోటెత్తనుంది. కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన స్వగృహంలో మరికాసేపట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని మీడియా సంస్థలకు నిన్న సాయంత్రానికే సమాచారం చేరింది. కాపులకు రిజర్వేషన్ల పేరిట మహోద్యమాన్ని చేపట్టిన ఆయన తుని గర్జనతో చంద్రబాబు సర్కారుకు పెను సవాల్ విసిరారు. ఆ తర్వాత భార్యతో కలిసి మూడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి సర్కారును తన వద్దకు రప్పించుకున్నారు. తాజాగా తనకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని ఘాటు పదజాలంతో కూడిన లేఖను ముద్రగడ మొన్న విశాఖలో విడుదల చేశారు. ఈ లేఖపై సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు టీడీపీ నేతలు ఫైరయ్యారు. ఏపీ కేబినెట్ లోని తన సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కూడా ముద్రగడపై నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందించడంతో పాటు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకే ముద్రగడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని లోకల్ మీడియా సంస్థలతో పాటు నేషనల్ మీడియా కూడా కిర్లంపూడి మీడియా సమావేశానికి తమ ప్రతినిధులను పంపిస్తోంది.

  • Loading...

More Telugu News