: మగాడివైతే... ప్రకాశం బ్యారేజీ మీదకు రా!: వైఎస్ జగన్ కు పయ్యావుల సవాల్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేతల భూదందాపై ‘సాక్షి’ దినపత్రిక నిన్న ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలకు కారణమైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. నేటి ఉదయం రోజా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్... అందుకు ప్రతిగా మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఘాటు వ్యాఖ్యలతో కూడిన సవాల్ విసిరారు. ‘‘మగాడివైతే... ప్రకాశం బ్యారేజీ మీదకు రా. మేం చర్చకు సిద్ధం. మీరు సిద్ధమేనా?’’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో తాను భూములు కొన్నానన్న వైసీపీ ఆరోపణలపై స్పందించిన పయ్యావుల... తాను మగాడిలా, సొంతంగా, సొంత పేర్లతో, సొంత డబ్బుతో భూములు కొన్నానని చెప్పారు. జగన్ బతుకంతా బినామీ బతుకేనని ఆయన ఆరోపించారు. సొంత కార్లను కూడా తనవేనని చెప్పుకునే ధైర్యం జగన్ కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. బినామీల గురించి మాట్లాడుతున్న జగన్ బినామీ పర్వాన్ని మరోమారు ప్రజల ముందుంచుతామని కూడా పయ్యావుల ప్రకటించారు.