: బాలయ్య నోట ఎన్టీఆర్ మాట!...‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు’ అని వ్యాఖ్య
టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తనదైన శైలిలో రాణిస్తున్నారు. వ్యవహార సరళిలోనే కాక మాట తీరులోనూ గణనీయమైన మార్పు ఆయనలో కనిపిస్తోంది. గతంలో సినీ రంగాన్ని ఏలిన ఆయన తండ్రి, దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావు ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అనేవారు. తాజాగా తండ్రి బాటలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన బాలయ్య... తొలి యత్నంలోనే తన తండ్రిని గెలిపించిన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా నియోజకవర్గ అభివృద్దిపై నిత్యం ఆలోచన చేస్తున్న బాలయ్య... మొన్న లేపాక్షి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాజాగా నిన్న శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన ఆయన అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య నోట ఆయన తండ్రి మాట వినిపించింది. ‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుత సాంకేతిక అభివృద్ధికి వేదాలే మూలమని కూడా బాలయ్య వ్యాఖ్యానించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు.