: 139 కోట్ల రూపాయలు జీహాద్ కోసం ఖర్చు చేయండి: వీలునామాలో లాడెన్


ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ కు చెందిన వందల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించిన వీలునామా బయటపడింది. పాకిస్థాన్ లోని అబొటొబాద్ లో లాడెన్ ను అమెరికన్ సీల్స్ అంతం చేసిన తరువాత, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని తమ వెంటతీసుకువెళ్లారు. ఆ పత్రాల్లో కొన్నింటిని అమెరికా నేడు బహిర్గతం చేసింది. వీటిలో లాడెన్ వందల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన వీలునామా బయటపడింది. దీని ప్రకారం సూడాన్ బ్యాంకుల్లో తన పేరిట ఉన్న 197.20 కోట్ల రూపాయలు, తన సోదరుడి ఇంజనీరింగ్ కంపెనీ నుంచి వారసత్వంగా లభించిన 82 కోట్ల రూపాయలను కలిపి మొత్తం 279.20 కోట్ల రూపాయల్లో 139 కోట్ల రూపాయలను ప్రపంచ జీహాద్ కోసం ఖర్చు చేయాలని వీలునామాలో పేర్కొన్నాడు. సూడాన్ బ్యాంకులో ఉన్న మొత్తం నుంచి సగభాగాన్ని తన వారికి రాశాడు. ఇందులో తల్లి ఖాదీజా ఉమ్ కు, కుమారుడు సాద్ బిన్ ఒసామాకు, కుమార్తెకు, ముగ్గురు చెళ్లెళ్లు, పినతల్లులు, వారి పిల్లలు, మామ, వారి పిల్లలకు ఎంతెంత ఇవ్వాలో కూడా వివరంగా పేర్కొన్నాడు. అలాగే తను సంపాదించిన వేలాది కోట్ల రూపాయల విలువ చేసే బంగారం కూడా వీరందరికీ ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో వివరంగా పొందుపరిచాడు. సూడాన్ బ్యాంకుల్లో ధనాన్ని తీసుకునేందుకు సహకరించే ఉగ్రవాది మొహఫౌజ్ అల్ వాలిద్ కు మొత్తంలో ఒక శాతం ఇవ్వాలని సూచించాడు. అతనికి ఇప్పటికే ఏడు కోట్ల రూపాయలు చెల్లించానని, ఆ మొత్తాన్ని కూడా కలుపుకోవాలని పేర్కొన్నాడు. తాను ఇంజనీరింగ్ కంపెనీ పెట్టేందుకు సహకరించిన ఇంజనీర్ కు ఆ కంపెనీ నుంచి లభించిన మొత్తంలో ఒక శాతం ఇవ్వాలని లాడెన్ సూచించాడు. 1996కు ముందు సూడాన్ లో లాడెన్ ఐదేళ్ల పాటు ఉన్నాడు. తీవ్రవాద కార్యకలాపాలపై ఆగ్రహించిన సూడాన్, దేశం విడిచి వెళ్లాల్సిందిగా లాడెన్ ను ఆదేశించింది. దీంతో అతను దేశం వీడి వెళ్లాడు. తన తండ్రికి రాసిన లేఖలో ఆయన కంటే ముందే మరణిస్తే, తన పిల్లలు, భార్య బాధ్యతను స్వీకరించాలని కోరాడు. ఆయన చూపిన బాటలో నడవనందుకు క్షమించాలని కోరాడు. మిలిటెంట్ కమాండర్లకు రాసిన లేఖల్లో తనను, తన తోటి పిల్లలను పెంచి పెద్ద చేసినందుకు, తమలో జీహాద్ తృష్ణను రగిలించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. వాషింగ్టన్ వైమానిక దాడులు లాడెన్ కుట్రేనని అక్కడ లభ్యమైన ఇతర పత్రాలు స్పష్టం చేయగా, తనపై జీవితాంతం నిఘా కొనసాగుతుందని లాడెన్ అభిప్రాయపడ్డాడు. దీంతో తనను కలిసేందుకు వచ్చే అనుచరులను మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు మాత్రమే రావాలని సూచించేవాడని తేలింది. అలాగే నిఘా నుంచి ఎలా తప్పించుకోవాలో వారికి నిత్యం చెబుతూనే ఉండేవాడు. తన భార్య పంటి ఆపరేషన్ చేయించుకోగా, ఆ పన్నులో శత్రువులు కంప్యూటర్ చిప్ ఏదైనా అమర్చారేమోనని ఆందోళన చెందేవాడని ఆ పత్రాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News