: మోదీ ఎవరి మాటను వింటారు?: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటను వింటారో తనకు అర్థం కావడం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, 'ప్రజలు ఏం మాట్లాడినా ప్రధాని మౌనంగా ఉంటారు. ప్రతి పక్షాలు డిమాండ్ చేసినా మౌనంగా ఉంటారు. మరి ఆయన ఎవరికి సమాధానం చెబుతారు?' అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అంటే స్కూల్ కాదన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించాలని ఆయన సూచించారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని చెప్పిన ప్రధాని దానిని మర్చిపోయారని ఆయన తెలిపారు. నల్లధనం ఉన్నవారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దగ్గరకు వస్తే...ఆయనే దానిని తెల్లధనంగా మారుస్తారని ఆయన వ్యంగోక్తి విసిరారు . పాకిస్థాన్ నేరుగా భారత్ పై యుద్ధానికి దిగుతోందని ఆయన అన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన తరువాత నేరుగా దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడితే అంతా తామే చేశామని, 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని చెబుతుంటారని...40 ఏళ్లుగా ఏమీ చేయకుండానే దేశంలోని పలు సమస్యలు పరిష్కారమయ్యాయా? అని ఆయన నిలదీశారు. నాగాలాండ్ సమస్యకు పరిష్కారం కనుగొన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు.