: ఇలా ఇంకెంత కాలం...త్వరగా పెళ్లి చేసుకో!: డికాప్రియోకి 'రోజ్' సూచన
ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు రావడంతో హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోకి అభినందనలు వెల్లువెత్తాయి. అందరికీ భిన్నంగా డికాప్రియోను స్టార్ గా మార్చిన 'రోజ్' విలువైన సలహాలు ఇచ్చింది. 'టైటానిక్' సినిమాలో డికాప్రియో ప్రియురాలు రోజ్ గా కేట్ విన్ స్లెట్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేట్ మాట్లాడుతూ, డికాప్రియోకి ఆస్కార్ వచ్చిందంటే తనకు ఆస్కార్ లభించినంత ఆనందంగా ఉందని పేర్కొంది. అయితే ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆస్కార్ వచ్చింది కనుక ఇకనైనా డికాప్రియో వివాహం చేసుకోవాలని కోరింది. డికాప్రియో మంచి తండ్రి కాగలడని కేట్ అభిప్రాయపడింది. ఒకసారి తండ్రి బాధ్యతలతో ప్రేమలో పడితే దానిని తప్పకుండా ఆస్వాదిస్తాడని కేట్ విశ్వాసం వ్యక్తం చేసింది. డికాప్రియో గర్ల్ ఫ్రెండ్స్ జాబితా పెద్దది కనుక, అతను ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే వారు అతనికి సరిపోతారో లేదో తాను చెక్ చేసి చెబుతానని కేట్ చమత్కరించింది. 'టైటానిక్' సినిమా సమయంలో ప్రారంభమైన వీరి స్నేహబంధం నేటికీ చెక్కుచెదరలేదు.