: చంద్రబాబుపై ముద్రగడ ఫైర్... హామీల అమలెక్కడ? అని ప్రశ్న


కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు ఏపీలోని టీడీపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టించేటట్టే ఉన్నారు. గత నెలలో రిజర్వేషన్ల కోసం‘కాపు ఐక్య గర్జన’ పేరిట కాపులను తూర్పుగోదావరి జిల్లా తుని కొబ్బరి తోటల్లోకి చేర్చిన ఆయన చంద్రబాబు సర్కారుకు చెమటలు పట్టించారు. ముద్రగడ పిలుపుతో వేలాదిగా అక్కడికి వచ్చిన కాపులు... ఇక రోడ్డుపైకే వెళదామంటూ ఆయన చేసిన సింగిల్ మాటతో విధ్వంసానికి దిగారు. ఆ తర్వాత కిర్లంపూడిలోని తన సొంతింటిలో సతీసమేతంగా మూడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి కలకలం రేపారు. ముద్రగడ దీక్ష దెబ్బకు చంద్రబాబు సర్కారు దిగిరాక తప్పలేదు. కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ చీఫ్ కిమిడి కళావెంకట్రావులు ప్రభుత్వ దూతలుగా వెళ్లి ముద్రగడ దీక్ష విరమించేలా చేశారు. ఆ సందర్భంగా వారు ప్రభుత్వం తరఫున కొన్ని హామీలు ఇచ్చి వచ్చారు. అయితే ఆ హామీలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో నేటి ఉదయం విశాఖ వెళ్లిన ముద్రగడ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దీక్ష విరమణ సందర్భంగా ఇచ్చిన హామీల అమలెక్కడ? అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. జాప్యంతో తమ సహనం నశిస్తోందన్న ముద్రగడ... రెండు, మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని పేర్కొన్నారు. తమ సామాజికవర్గ నేతలతో కలిసి చర్చించి ఉద్యమ ప్రణాళికను వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. ముద్రగడతో వెళితే కేసులు పెడతామంటూ కాపు యువతను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాక తాను వైసీపీలో చేరుతున్నానని, టీడీపీ సర్కారుకు అమ్ముడుబోయానని అసత్య ప్రచారం చేయిస్తున్నారని కూడా ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News