: ‘కూల్చుతాం’ అన్న జగన్ వ్యాఖ్యలకు జవాబే చేరికలు: కేఈ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’కు సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఈ సొంత జిల్లా కర్నూలుకు చెందిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కొద్దిసేపటి క్రితం విజయవాడలో సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మణిగాంధీని మీడియా పాయింట్ వద్దకు తీసుకువచ్చిన కేఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టీడీపీ ఎమ్మెల్యేల్లో 21 మంది మాతో టచ్ లో ఉన్నారు. అనుకుంటే ఒక్కరోజులో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’ అని వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేఈ ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని జగన్ చేసిన ప్రకటనకు జవాబుగానే ‘ఆకర్ష్’ను ప్రయోగించామని ఆయన అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేల చేరిక ఇంకా పూర్తి కాలేదని, మరింత మంది తమతో టచ్ ఉన్నారని కేఈ పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లోనే మరో ఐదారుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారన్నారు. ప్రలోభాలకు గురి చేసి విపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం తమకు లేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతున్న క్రమంలో ప్రతిపక్ష హోదా పోతుందేమోనన్న భయం జగన్ ను పట్టి పీడిస్తోందని కేఈ వ్యాఖ్యానించారు.