: కాంగ్రెస్ కు ‘పోల్ మ్యాన్’ సహకారం... యూపీ ఎన్నికలపై రాహుల్ తో కలిసి సమీక్ష
దేశంలో కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఏడాది ముందుగానే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు నేడు యూపీకి చెందిన పార్టీ కీలక నేతలు, ఏఐసీసీ నేతలతో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి ‘పోల్ మ్యాన్’గా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కూడా హాజరుకానున్నారు. గతంలో ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తూ ఉన్నపళంగా ఉద్యోగాన్ని వదిలేసి స్వదేశం చేరిన ప్రశాంత్ కిశోర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి ప్రచార వ్యూహాలను రచించారు. ‘ఛాయ్ పే చర్చా’ పేరిట ఆయన రూపొందించిన ప్రచారం మోదీకి ఘన విజయాన్ని కట్టబెట్టింది. బీహార్ కు చెందిన ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన జేడీయూ నేత నితీశ్ కుమార్ వెంటనే రంగంలోకి దిగేశారు. ప్రశాంత్ కిశోర్ ను తన వద్దకు రప్పించుకున్నారు. ‘పర్చా పే చర్చా’ పేరిట సరికొత్త ప్రచారాన్ని రూపొందించుకున్నారు. విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ... ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టింది. ఈ పరిచయంతోనే రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ వ్యూహాలను రచించేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో నేడు జరగనున్న కీలక భేటీలో రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొంటున్నారు.