: కింకర్తవ్యం!... ‘బడ్జెట్’ అన్యాయంపై మరికాసేపట్లో ఏపీ కేబినెట్ కీలక భేటీ
సురేశ్ ప్రభు ‘రైలు’ ఏపీలో ఆగలేదు. జైట్లీ పద్దులో ఏపీకి పెద్దగా చోటూ దక్కలేదు. వెరసి రెండు బడ్జెట్లలోనూ ఏపీకి తీరని అన్యాయమే జరిగింది. మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నా, టీడీపీ సర్కారు ఏపీకి ఏమీ తీసుకురాలేకపోయింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే పెద్దగా నిధులు రాలేదని బీజేపీ నేతల వ్యాఖ్యలు చికాకు తెప్పిస్తున్నాయి. నిన్నటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్రం నిరాదరణపై ఒకింత ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత, ఏసీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో తన మంత్రి మండలి సహచరులతో దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని చెబుతున్న చంద్రబాబు... అక్కడి నుంచి పెద్దగా హామీ ఏమీ రాకపోవడంతో డైలమాలో పడ్డారు. అంశాల వారీగా కాకుండా శాఖలవారీగా కేటాయింపులు చేశామని జైట్లీ చెప్పిన విషయంపై చంద్రబాబు సంతృప్తి చెందనట్టే కనిపిస్తోంది. ఏం చేస్తే, కేంద్రాన్ని దారికి తెచ్చుకోవచ్చన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయిన ఏపీని ఆదుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా... కేంద్రం ముందు తమ వాదన చెవిటోడి ముందు శంఖం ఊదిన చందంగానే ఉంటోందని కూడా చంద్రబాబు ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఇలాగైతే కాదు, ఇకపై కేంద్రంతో కాస్తంత గట్టిగానే మాట్లాడాలని నిర్ణయించుకున్న చంద్రబాబు... నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ భేటీపై అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలోనూ ఆసక్తి నెలకొంది.