: తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులకు మొట్టికాయలేసిన ‘సుప్రీం’ జడ్జి!
తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, ఆయన వద్ద జూనియర్ గా పనిచేస్తున్న మరో న్యాయవాది వ్యవహార సరళిపై నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘ఇదేం కోర్టు అనుకుంటున్నారు?’ అంటూ ఆయన చీవాట్లు పెట్టారు. ఏపీ ఉన్నత విద్యామండలికి సంబంధించిన వ్యవహారంపై నిన్న విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యాజ్యంలో తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. రామకృష్ణారెడ్డికి సహకారమందించే క్రమంలో ఆయన జూనియర్ న్యాయవాది ఒకరు ఆద్యంతం గుసగుసలాడుతూనే ఉన్నారు. పాయింట్లు, సెక్షన్ల నెంబర్లు చెబుతూనే ఉన్నారు. కొంతసేపు ఓపిక పట్టిన జస్టిస్ గౌడ... ఆ తర్వాత ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ‘‘ఏమనుకుంటున్నారు? ఇదేమైనా మేజిస్ట్రేట్ కోర్టు అనుకుంటున్నారా? సుప్రీంకోర్టు. ఇక్కడ ఇలాంటివి జరగవు. చాలాసేపటి నుంచి చూస్తున్నా, ఆయనకు మీరు చెబుతూనే ఉన్నారు. ఆయన అడ్వొకేట్ జనరల్. ఇదే కేసుపై హైకోర్టులో కూడా వాదనలు వినిపించారు. అయినా మీరు గుసగుసలాడుతూనే ఉన్నారే?’’ అంటూ జస్టిస్ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు.