: చంద్రబాబును ‘యూజ్ లెస్ ఫెలో’ అన్న సి.రామచంద్రయ్య!... తిప్పికొట్టిన వర్ల!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ, విపక్ష కాంగ్రెస్ ల మధ్య నిన్న మాటల తూటాలు పేలాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు మీరు యూజ్ లెస్ ఫెలో అంటే.. కాదు కాదు మీరే యూజ్ లెస్ ఫెలో అంటూ విమర్శలు సంధించుకున్నారు. తొలుత హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ‘యూజ్ లెస్ ఫెలో’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయలేని చంద్రబాబు... పార్టీ ఫిరాయింపులను మాత్రం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ‘‘రైల్వే, సాధారణ బడ్జెట్ లలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధానమైన పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.200 కోట్లు మాత్రమే వచ్చాయి. రాజధానికి పైసా కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా రాలేదు. కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేదు. యూజ్ లెస్ ఫెలో. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నందున కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి ఎదురైంది. కేంద్రాన్ని నువ్వు నిలదీయలేనప్పుడు ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసి... వారితోనైనా నిలదీయించు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చూపిస్తోన్న శ్రద్ధను అభివృద్ధి కార్యక్రమాలపై చూపించు’’ అని ఆయన చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామచంద్రయ్య ఘాటు వ్యాఖ్యలపై సమాచారం అందుకున్న టీడీపీ నేతలు భగ్గుమన్నారు. నిన్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం కోసం విజయవాడలో ఉన్న పార్టీ సీనియర్ నేత, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య మైకందుకున్నారు. ‘రామచంద్రయ్యే అతి పెద్ద యూజ్ లెస్ ఫెలో’ అని ఆయన ఘాటుగా స్పందించారు. చిరంజీవితో పార్టీ పెట్టించి, ఆయనను కూడా యూజ్ లెస్ ఫెలోను చేసిన ఘనత రామచంద్రయ్యది అని వర్ల అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కూడా వర్ల... రామచంద్రయ్యకు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News