: సైకిలెక్కనున్న కోడుమూరు ఎమ్మెల్యే... కర్నూలులో వైసీపీకి మరో షాక్


ఏపీలో విపక్ష వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇక ‘గేట్లు ఎత్తేద్దాం’ అన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటనతో మొదలైన వలసలు వైసీపీకి కంచుకోటలా ఉన్న కర్నూలు జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్ది, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, భూమా కూతురు అఖిలప్రియలు నేరుగా విజయవాడకు వెళ్లి టీడీపీలో చేరిపోయారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన కోడుమూరు ఎమ్మెల్యే మణి గాంధీ కూడా సైకిలెక్కేస్తున్నారు. నిన్న సాయంత్రానికే కర్నూలు నుంచి విజయవాడ చేరుకున్న మణి గాంధీ నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. టీడీపీలో చేరికపై ఇప్పటిదాకా నోరు విప్పని మణి గాంధీ... గుట్టు చప్పుడు కాకుండానే పార్టీ మారేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కంటే కర్నూలు జిల్లాలోనే అత్యధిక స్థానాలు దక్కాయి. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా, ఏకంగా 11 స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట కిందే లెక్క. తాజాగా భూమా తన కూతురు సహా టీడీపీలో చేరడం, తాజాగా మణి గాంధీ కూడా సైకిలెక్కనుండటంతో... ఆ జిల్లాలో వైసీపీ బలం ఒక్కసారిగా 8కి పడిపోనుంది. ఇక గడచిన ఎన్నికల్లో ముక్కీ మూలిగి మూడు సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ బలం అమాంతంగా ఆరుకు చేరనుంది.

  • Loading...

More Telugu News