: మూడు దేశాల తరఫున యుద్ధం చేసిన ఒకే సైనికుడు!


ఏ సైనికుడైనా తన దేశం తరపున యుద్ధంలో పాల్గొంటాడు. అయితే, అందుకు భిన్నంగా ఈ సైనికుడు మూడు దేశాల తరపున మూడు యుద్ధాల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా 1944లో ఫ్రాన్స్ లోని నార్మండీలో లొంగిపోయిన జర్మన్ సైనికులను అమెరికా సైనికాధికారులు వరుసగా నిలబెట్టారు. వారిలో కుయుంగ్ జాంగ్ అనే ఒక జపనీయుడు ఉండడం చూసి అతనిని బ్రిటన్ జైలుకు, అక్కడి నుంచి అమెరికాకు తరలించారు. కుయుంగ్ జాంగ్ జపాన్ అధీనంలో ఉన్న కొరియాలో జన్మించారు. 1938లో అతనిని జపాన్ సైన్యంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో రష్యాతో జరిగిన యుద్ధంలో రష్యా సేనలకు బందీగా దొరికిపోవడంతో ఆయనను రష్యాకు తీసుకెళ్లారు. అనంతరం కొంత కాలానికి అతనిని రష్యా సైన్యంలోకి తీసుకున్నారు. అదే సమయంలో రష్యాతో జర్మనీకి యుద్ధం జరిగింది. అప్పుడు కుయుంగ్ జాంగ్ హిట్లర్ సేనలకు దొరికిపోయారు. దీంతో అతనిని బందీగా జర్మన్ సేనలు తమ దేశానికి తీసుకెళ్లాయి. 1944లో జర్మనీకి సైనికుల కొరత ఏర్పడింది. ఈ సమయంలో జైళ్లలో మగ్గుతున్న మాజీ సైనికులకు శిక్షణ ఇచ్చి వారిని సైన్యంలోకి తీసుకున్నారు. అలా జర్మన్ సైన్యంలో జాంగ్ స్థానం సంపాదించుకున్నారు. అనంతరం అమెరికాతో జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ లోని నార్మండీ ప్రాంతంలో జర్మనీ పరాజయం పాలైంది. ఈ సందర్భంగా అమెరికన్ సేనలకు వేలాది మంది జర్మనీ సైనికులు బందీలుగా పట్టుబడ్డారు. దీంతో ఆయనను పట్టుకున్న అమెరికా సైనికులు ఆయనను జపనీయుడిగా భావించి బ్రిటన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు తీసుకుపోయారు. తరువాత విచారణలో తాను జపనీయుడిని కాదని, కొరియన్ నని నిరూపించుకోవడంతో ఆయనకు క్షమాభిక్ష పెట్టారు. అనంతరం అమెరికాలోనే నివసించిన జాంగ్ తుది శ్వాస వరకు కొరియాలో తన తల్లిదండ్రులు ఎవరు? అన్న విషయం వెల్లడించకపోవడం విశేషం. కాగా, కొరియాలో జన్మించిన కుయుంగ్ జాంగ్ జపాన్, రష్యా, జర్మనీ దేశాల సైనికుడిగా పని చేయడం అరుదైన విషయం. ఆయన జీవిత చరిత్రపై ఓ సినిమా కూడా రూపొందడం విశేషం.

  • Loading...

More Telugu News