: దీనిని ఏమంటారో చక్రి కుటుంబ సభ్యులే చెప్పాలి: శ్రావణి తరఫు లాయర్
ఆస్తి కోసం కోర్టులో కేసు వేసిన తరువాత, విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించడం, ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఉన్నపళంగా ఖాళీ చేయాలని కోరడాన్ని ఏమంటారో దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యులే చెప్పాలని అతని భార్య శ్రావణి తరఫు లాయర్ గోకుల్ కుమార్ ప్రశ్నించారు. ఈ వివాదంపై ఆయన మాట్లాడుతూ, ఆస్తి కావాలని శ్రావణి కోర్టుకు వెళ్లలేదని, చక్రి కుటుంబ సభ్యులే వెళ్లారని తెలిపారు. తనకు తెలిసి చక్రి తండ్రి హెడ్మాస్టర్ గా రిటైర్ అయ్యారని, ఆయన తదనంతరం చక్రి తల్లికి పెన్షన్ వస్తోందని తెలిపారు. దీంతో ఆమె జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే సమస్యంతా చక్రి సోదరుడితోనేనని, అతను కూడా చక్రి నివాసంలో వాటా కావాలని కోరుతున్నాడని, అది చట్టవిరుద్ధమని ఆయన చెప్పారు. ఆ ఇంట్లో చక్రి భార్య, తల్లికి మాత్రమే భాగం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం కూడా అతని ప్రోద్బలంతోనే ప్రారంభమై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదానికి న్యాయస్థానం పరిష్కారం ఇస్తుందని, అంతకు ముందు అద్దెకున్న వారి దగ్గరకు వెళ్లి ఆందోళన చేయడం, వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం నేరమని ఆయన స్పష్టం చేశారు.