: నన్ను ఇబ్బంది పెట్టాలనే అత్తవారి కుటుంబం ఆందోళన చేస్తోంది: సంగీత దర్శకుడు చక్రి భార్య
కేవలం తనను ఇబ్బంది పెట్టేందుకే తన అత్తగారి కుటుంబం ఆరోపణలు చేస్తోందని దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి ఆరోపించారు. చక్రి తల్లి, సోదరుడు చేసిన ఆరోపణలపై ఆమె మాట్లాడుతూ, తాను హైదరాబాదులో ఉన్నప్పుడు 'వివాదాలు వద్దు, పెద్దల సమక్షంలో సెటిల్ చేసుకుందామ'ని ఎన్నిసార్లు పిలిచినా వారు రాలేదని, పైపెచ్చు ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారని ఆమె అన్నారు. కోర్టులో కేసు నడుస్తోందని, మరో 15 రోజుల్లో ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉందని ఆమె వెల్లడించారు. ఇంతలో ఉన్నత చదువు కోసం తాను యూఎస్ వచ్చిన తరువాత కేవలం తనను ఇబ్బంది పెట్టడంలో భాగంగా హైదరాబాదులో వారు ఆందోళన చేపట్టారని ఆమె ఆరోపించారు. తన అత్తగారు ఆస్తి కావాలని ఆందోళన చేస్తున్నారని, ఆమెకు చక్రినే కాకుండా ఇంకా పిల్లలు ఉన్నారని, అలా ధర్నా చేయనివ్వకుండా వారెందుకు ఆమెను ఆపలేకపోయారని, ఆమెకు ఆశ్రయం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై లేదా? అని ఆమె ప్రశ్నించారు. అంటే ఈ ధర్నా ఆస్తి కోసం, తనను ఇబ్బంది పెట్టడం కోసం అని నిర్థారణ కావడం లేదా? అని ఆమె నిలదీశారు. తాను వారిని ప్రేమిస్తూ ఉంటే, వారేమో ద్వేషిస్తున్నారని ఆమె చెప్పారు. తన భర్త అంతిమ సంస్కారాలు, సంవత్సరీకం తదితరాలన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించానని ఆమె తెలిపారు. అత్తవారి కుటుంబం కావాలనే తనపై ఆరోపణలు చేస్తోందని ఆమె విమర్శించారు.