: టీమిండియాను అడ్డుకోవడం లంకేయులకు సాధ్యమేనా?
ఆసియాకప్ లో భాగంగా శ్రీలంక-భారత్ మధ్య కాసేపట్లో టీట్వంటీ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో టైటిల్ హాట్ ఫేవరేట్ గా పరిగణించబడుతున్న భారత జట్టు జోరును లంకేయులు అడ్డుకోగలరా? అన్నది సందేహమే. బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో తడబడిన శ్రీలంక జట్టు టీమిండియాను అడ్డుకోవడంలో ఏ మేరకు సఫలమవుతుందనేది ఆసక్తికరంగా వుంది. కాగా, సీనియర్లు, యంగ్ స్టర్ల కలయికతో ఉన్న లంక జట్టులో దిల్షాన్, మాథ్యూస్, తిసార పెరీరా, చండిమాల్ బ్యాటుతో సత్తా చాటితే, మలింగ, మాథ్యూస్, కులశేఖర, చమీర, శనక బౌలింగ్ లో సత్తాచాటగలరు. అయితే జోరుమీదున్న టీమిండియా బ్యాట్స్ మన్ ను అడ్డుకోవడం వీరికి సవాలే. అదే సమయంలో ఆసియాలో అత్యుత్తమ బౌలింగ్ మేళవింపు కలిగిన నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజా, యువరాజ్ లను ఎదుర్కోవడం కూడా సవాలే. ఈ నేపథ్యంలో టీమిండియాను శ్రీలంక జట్టు అడ్డుకోగలదా? అని క్రీడా పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పొట్టి ఫార్మాట్ లో ఏదైనా సాథ్యమేనని వారు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో టీమిండియాలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆటగాళ్లు ఉన్నారన్న విషయాన్ని మరువకూడదని హెచ్చరిస్తున్నారు. కాగా, గాయం కారణంగా పాక్ తో ఆడని ధావన్, పాక్ తో మ్యాచ్ లో గాయపడ్డ రోహిత్, వెన్నునొప్పితో బాధపడుతున్న ధోనీ ఈ మ్యాచ్ లో ఆడుతారా? లేదా? అనేది కాస్త అనుమానమే. ఇదే సమయంలో గాయం కారణంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు దూరమైన మలింగ ఆడే విషయం కూడా అనుమానమే. అయితే కీలకమైన ఈ మ్యాచ్ లో ప్రయోగం చేసేందుకు ఏ జట్టూ కూడా సిద్ధంగా లేకపోవడం విశేషం.