: షాపు యజమానిని చితకబాదిన శివసేన ఎమ్మెల్యే... సోషల్ మీడియాలో వీడియో!
ముంబైలో శివసేన ఎమ్మెల్యేల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడుతున్నందుకు తన వాహనాన్ని ఆపిన మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ పై శివసేన నాయకుడు ఒకరు దాడికి దిగిన ఘటన మర్చిపోకముందే, ముంబై నగరంలో షాప్ ఓనర్ పై కర్రతో విరుచుకుపడి మరో ఎమ్మెల్యే హల్ చల్ చేశాడు. తొలి ఘటన ట్రాఫిక్ సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా, తాజా ఘటన షాపులో దొంగలకు చెక్ చెప్పేందుకు అమర్చిన సీసీ కెమెరా రికార్డు చేసి, ఎమ్మెల్యే పాటిల్ నిర్వాకాన్ని బట్టబయలు చేసింది. 100 వడాపావ్ ను పార్శిల్ చేసి, ఉచితంగా ఇంటికి పంపాలని సదరు ఎమ్మెల్యే షాపు యజమానికి ఆర్డర్ వేశాడు. దానికి షాపు యజమాని నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఓ పొడవాటి కర్ర తీసుకువచ్చి షాపు యజమానిపై దాడికి దిగాడు. అతనిని విచక్షణ లేకుండా చితకబాదాడు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డైంది. దీనిని షాప్ యజమాని 'శివసేన ఎమ్మెల్యే నిర్వాకం' అంటూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఇతర రాజకీయ పక్షాలకు సరైన అస్త్రం దొరికినట్టైంది. అలాగే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన ఘటనకు కారణమైన ఎమ్మెల్యేను సస్పెండ్ చేసింది.