: కనకదుర్గ గుడిలో పెళ్లిళ్లు వద్దట!... ఈఓ నర్సింగరావు వివాదాస్పద నిర్ణయం
బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఇక పెళ్లి చేసుకోవాలనుకునే వారికి నిరాశే ఎదురు కానుంది. పెళ్లిళ్లే కాకుండా బారసాలలు, ఇతర శుభకార్యాలపైనా అక్కడ నిషేధం విధిస్తూ ఆలయ ఈఓ నర్సింగరావు కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఆలయంలో జరుగుతున్న దొంగ పెళ్లిళ్లకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నర్సింగరావు ప్రకటించారు. ఆలయంలోనే పెళ్లి చేసుకోవాలని ఏమీ లేదు కదా? అన్న ఆయన, ఈ సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రస్తావించారు. తిరుమలలో స్వామివారి ముందే తాళి కట్టడం లేదు కదా? అని వ్యాఖ్యానించిన ఆయన అమ్మవారి గుడి ముందే పెళ్లి చేసుకోవాలన్న రూలేమీ లేదన్నారు. గుడి పరిసరాల్లో ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఒకటేనన్నారు. గుడిలో స్థలాభావం వల్ల 1996 నుంచి పెళ్లిళ్ల కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.