: మెక్సికోలో ప్రమాదకర 'రేడియో ధార్మిక' పదార్థాన్ని దోచుకుపోయారు!
మెక్సికోలో అత్యంత ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం దొంగతనానికి గురవడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఓ ట్రక్కు భారీ స్థాయిలో రేడియోయాక్టివ్ పదార్థాలతో వెళుతుండగా, దాన్ని అడ్డగించిన కొందరు దోచుకుపోయారని, దీంతో ఐదు రాష్ట్రాల్లో అత్యవసర అప్రమత్తతను విధించి, దానికోసం వెతుకుతున్నామని మెక్సికో నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ సివిల్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2006 సంవత్సరానికి చెందిన ఎర్రటి చవర్లెట్ సిల్వరాడో పికల్ వాహనంలో ఇరీడియం-192 ఉందని, దీన్ని సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అపహరించుకుపోయారని వెల్లడించారు. ఓ పసుపు రంగు కంటెయినర్లో ఇది ఉందని, దీని వాడకం తెలీని వారు తాకితే ప్రమాదకరమని, సరైన రక్షణ చర్యలు లేకుండా బయటకు తీసినా ప్రమాదం సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఆ కంటెయినర్ కోసం వెతుకుతున్నామని, ఆ పదార్థం దానిలో ఉన్నంతవరకూ అంతా సురక్షితమేనని తెలిపింది.