: బడ్జెట్ లో ఏపీకి అన్యాయం... నిరసన గళం విప్పిన చంద్రబాబు


మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిరసన గళం వినిపించారు. నిన్న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో భాగంగా తన పార్టీ నేతలు, కేబినెట్ సహచరుల వద్ద అంతర్గత చర్చల్లో తన ఆవేదనను వ్యక్తం చేసిన చంద్రబాబు... తాజాగా కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన సందర్భంగా చంద్రబాబు తన గళాన్ని బహిరంగంగానే వినిపించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నవ్యాంధ్ర... పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేదాకా చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ సహా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరామన్నారు. ఇవేవీ ప్రకటించని కేంద్రం కనీసం నిధుల కేటాయింపుల్లోనైనా న్యాయం చేస్తుందనుకుంటే, అదీ చేయలేదన్నారు. దీనిపై తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని చంద్రబాబు చెప్పారు. అంశాల వారీగా కాకుండా శాఖల వారీగా నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఏదేమైనా బడ్జెట్ లో ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News