: డొనాల్డ్ నోట 'గాంధీ మాట'... ఆయనెప్పుడు చెప్పారంటున్న అమెరికన్ మీడియా!
అమెరికాలో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష బరిలో నిలుస్తారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మహాత్మా గాంధీ చెప్పారంటూ ఓ కోట్ ను ఉంచగా, గాంధీ, తన జీవితంలో ఈ కోట్ ను ఎన్నడూ ఉచ్చరించలేదని అమెరికన్ మీడియా దుమ్మెత్తి పోసింది. "తొలుత వారు నిన్ను విస్మరిస్తారు. ఆపై నిన్ను చూసి నవ్వుతారు. ఆ తరువాత యుద్ధం చేస్తారు. నువ్వు గెలుస్తావు - మహాత్మాగాంధీ" (First they ignore you. Then they laugh at you, then they fight you, then you win - Mahatma Gandhi) అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు అలబామాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ ఫోటోనూ ట్రంప్ ఉంచారు. "గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని ఎక్కడా రికార్డులు లేవు. ఈ మాటలు 1918లో ట్రేడ్ యూనియన్ సోషలిస్టు నేత నికోలస్ క్లెస్ వాడారు" అని పలు మీడియా సంస్థలు, నెటిజన్లు ట్వీట్లతో విరుచుకుపడ్డారు. తాను చేయని కోట్ ను గాంధీకి ఆపాదించారని వికీ కోట్స్ వ్యాఖ్యానించింది.