: రాహుల్ గాంధీపై కేసు సరికాదు: ఉత్తమ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉగ్రవాదులకు మద్దతిచ్చారంటూ హైదరాబాదులో కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. రాహుల్ పై కేసు సరికాదన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన రాహుల్ కుటుంబంపై కేసులా? అని ప్రశ్నించారు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీసింది కాంగ్రెస్సేనని గుర్తించాలన్న ఉత్తమ్, దేశద్రోహులకు కాంగ్రెస్ ఎన్నడూ మద్దతు పలకదని స్పష్టం చేశారు. అమాయక విద్యార్థులపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడరని, కేవలం టీఆర్ఎస్ మైండ్ గేమ్ లో భాగంగా అలా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ కులాల తొలగింపుపై బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.