: పోలవరం ప్రాజెక్టుకు ‘యంత్ర యాత్ర’... భారీ యంత్రాలకు ఎదురేగి స్వాగతం పలికిన దేవినేని
అప్పటిదాకా 23 జిల్లాలతో దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా వెలుగు వెలిగిన ఆంధ్రప్రదేశ్... రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో ఓ చిన్న ముక్కగా మిలిగింది. విభజనకు ముందు కర్ణాటక, మహారాష్ట్రల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి సాగు నీరు అందుకున్న ఏపీకి, విభజన తర్వాత కొత్తగా తెలంగాణ దయాదాక్షిణ్యాలు కూడా అవసరమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని సాగు భూమికి నీరందించే విషయంపై కొత్తగా అధికారం చేపట్టిన నారా చంద్రబాబునాయుడి సర్కారు దృష్టి సారించింది. ఆ క్రమంలోనే యుద్ధప్రాతిపదికన పట్టిసీమ ప్రాజెక్టును పట్టుబట్టి మరీ, నెలల వ్యవధిలో పూర్తి చేసింది. తాజాగా పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఈ బాధ్యతలను జలవరుల శాఖ మంత్రి హోదాలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తన భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో పోలవరం పనులు ఊపందుకున్నాయి. జపాన్, అమెరికా నుంచి భారీ యంత్రాలను కొనుగోలు చేసిన ఏపీ సర్కారు... వాటిని ఓడల ద్వారా చెన్నై నౌకాశ్రయానికి చేర్చింది. అక్కడి నుంచి భారీ వాహనాలపైకి చేర్చి ప్రాజెక్టు వద్దకు తరలిస్తోంది. ఈ యంత్రాలకు దేవినేని ఉమా నిన్న నెల్లూరు జిల్లాలో ఎదురేగి స్వాగతం పలికారు. పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వాకాటి నారాయణలతో కలిసి ఆ భారీ వాహనాల వద్దకు వెళ్లిన దేవినేని వాటికి స్వాగతం పలికారు. ఈ ఆసక్తికర సన్నివేశాన్ని ‘పోలవరానికి యంత్ర యాత్ర’ పేరిట ఓ తెలుగు దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ఫొటోలతో పాటు ప్రచురించింది.