: భూమా మార్క్ రాజకీయం... ఫరూక్ తో కలసి టార్గెట్ శిల్పా బ్రదర్స్!


కర్నూలు జిల్లాలో ఒకే పార్టీలో చేరిన ప్రత్యర్థుల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలో ప్రధాన తెలుగుదేశం నేతలైన శిల్పా సోదరులకు ఇష్టం లేకున్నా, భూమా కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక భూమా జిల్లా టీడీపీలో పట్టును పెంచుకునేందుకు తనదైన శైలిలో ముందడుగు వేశారు. దాదాపు పదేళ్ల తరువాత మాజీ మంత్రి ఫరూక్ ను కలుసుకున్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ శిల్పా సోదరులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. వారు ఓడిపోయిన నేతలని గుర్తు చేశారు. ఓడిన వారు సిగ్గుపడాలని, బయటకు కూడా రావద్దని ఫరూక్ హెచ్చరించారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాట్లాడేందుకు వాళ్లెవరని, ముఖ్యమంత్రికి నచ్చితే, భూమాకు డిప్యూటీ సీఎం పదవైనా దక్కొచ్చని అన్నారు. వరద పనులకు కేటాయించిన నిధులను సోదరులిద్దరూ మెక్కేశారని ఆరోపించారు. రోడ్ల విస్తరణ గురించి, ప్రజల ఇబ్బందుల గురించి, నంద్యాలకు వరదముప్పు గురించి వాళ్లు ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. భూమా మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా పేదలకు 3 వేల ఇళ్లను కట్టించడానికి కృషి చేస్తే, శిల్పా సోదరులు కావాలనే అడ్డుకున్నారని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా టీడీపీ నేతల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు ఇంకా మరెన్నో మలుపులు తిరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News