: కేంద్ర బడ్జెట్ సిద్ధం... వండి వార్చిన నలభీములు ఎవరంటే!
2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సిద్ధమైపోయింది. నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపుగా మూడు నెలలుగా అలుపెరగని కసరత్తు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ను కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రాథమ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. బడ్జెట్ రూపకల్పనకు కర్త, కర్మ, క్రియ... మొత్తం జైట్లీనే అయినా, ఈ కసరత్తులో అధికారుల పాత్రే కీలకం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బీజేపీ యువ నేత జయంత్ సిన్హా కూడా ఈ కసరత్తులో కీలక భూమికే పోషించారు. ఇక బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా పనిచేసిన అధికారుల విషయానికి వస్తే... రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న హస్ ముఖ్ ఆదియా, ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ పి. వటల్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి నీరజ్ కుమార్ గుప్తా, ముఖ్య ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, బడ్జెట్ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ గోయల్, ముఖ్య సలహాదారు (కాస్ట్) అరుణా సేథీలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రతినిధులుగా ఆర్థిక శాఖలో ఉన్న 34 మంది ఆర్థిక సలహాదారులు బడ్జెట్ రూపకల్పనతో పాటు దానికి తుది రూపును ఇచ్చారు. బడ్జెట్ రూపకల్పనలో బాహ్య ప్రపంచానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న వీరితో కలిసి అరుణ్ జైట్లీ, జయంత్ సిన్హా తీయించుకున్న గ్రూప్ ఫొటోను దాదాపుగా అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.