: డబ్బు కోసమే మా అమ్మ వివాదం రాజేసింది: సినీనటి స్వాతి రెడ్డి
తన తల్లి డబ్బు కోసమే వివాదం రేపిందని వర్ధమాన సినీ నటి స్వాతిరెడ్డి తెలిపింది. తల్లితో ఉన్న వివాదంపై ఆమె మాట్లాడుతూ, తన తల్లికి కావాల్సిన డబ్బు అందడంతో వివాదం సమసిపోయిందని చెప్పింది. తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని, వారిపై తన తల్లి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని, తద్వారా వారి కుటుంబాల్లో చిచ్చురేగిందని ఆమె చెప్పింది. వాస్తవానికి తన తల్లి పేర్కొన్నట్టు తనకు ఎలాంటి అభ్యంతరకర సంబంధాలు లేవని స్పష్టం చేసింది. అలాంటివి ఉంటే తన సోదరుడితో కలిసి ఉండడం కుదిరేది కాదని ఆమె చెప్పింది. తన తల్లి నుంచి తాను బయటకు వచ్చేశానని, హైదరాబాదు వెళ్లి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని స్వాతి చెప్పింది. కెరీర్ బాగుంటే సినిమాల్లో నటిస్తానని, లేదంటే రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకుని సెటిలైపోతానని స్వాతి రెడ్డి పేర్కొంది. తాను మేజర్ నని, ఇకపై తనకు, తన తల్లికి సంబంధం లేదని ఆమె తెలిపింది.