: ఎవరికి కోత - ఎవరిపై వాత... ఇప్పటికి సస్పెన్స్!
అఖండ భారతావనిలోని ప్రజల ఆశలు, ఆకాంక్షలను తీరుస్తామన్న భరోసా కల్పించేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ను రూపొందించి వుంటారా? లేదా ఖజానాకు మరింత నిధులను చేర్చేలా పన్నులను వడ్డిస్తారా? మరో 24 గంటల్లో పార్లమెంట్ ముందుకు వచ్చే 2016-17 వార్షిక బడ్జెట్ లో ఏముంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండో బడ్జెట్ ఇది. తొలి బడ్జెట్ లో వ్యవస్థ ప్రక్షాళన, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం, స్వచ్ఛ భారత్, జన్ ధన్, గోల్డ్ మానిటైజేషన్ వంటి స్కీములను ప్రకటించిన సంగతి తెలిసిందే. సంస్కరణలు, సంక్షేమమే లక్ష్యంగా సాగుతామని తెలిపినా, రాజ్యసభలో బలం లేకపోవడంతో కీలక సంస్కరణలేవీ అమలు కాలేదు. దీనికితోడు అంతర్జాతీయ అంశాలు సైతం ఇండియాకు అడ్డంకులుగా నిలిచాయి. దీంతో ఈ బడ్జెట్ ప్రజాకర్షక పథకాల కన్నా, సంస్కరణలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు జైట్లీ ఇప్పటికే సంకేతాలు వెలిబుచ్చారు. ఆర్థిక రంగంలో సేవలందిస్తున్న పలు కంపెనీలు, రీసెర్చ్ సంస్థలు, ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా మందగమం నెలకొన్నా, భారత్ మాత్రం వృద్ధి పథంలో పయనిస్తూ, ఎన్నో అగ్రరాజ్యాలకన్నా మెరుగైన జీడీపీని నమోదు చేస్తోంది. ప్రస్తుతానికి అంతా సవ్యంగా ఉన్నట్టే కనిపిస్తున్నా, చైనా సంక్షోభం, ముడిచమురు, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు భవిష్యత్తులో దేశానికి సవాళ్లే. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం మోదీ సర్కారు ముందున్న ప్రధాన కర్తవ్యం. ఆ దిశగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ బడ్జెట్ లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, ఇండియాలో వ్యాపారాన్ని మరింత సానుకూలంగా మారుస్తూ నిర్ణయాలు వెలువడవచ్చు. భారత్ ను తయారీ కేంద్రంగా నిలపాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నా, ఎగుమతులు నేల చూపులు చూస్తున్న నేపథ్యంలో వీటిని పెంచేందుకు కొన్ని రాయితీలు ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని విభాగాల్లో సబ్సిడీల కోత, మరిన్ని విభాగాలకు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) విస్తరణ కూడా ఉంటుందని సమాచారం. ఇక వ్యక్తిగత పన్ను విషయానికి వస్తే, పన్ను పరిధుల సడలింపు ఉంటుందా? ఉండదా? అన్న విషయమై సస్పెన్స్ నెలకొంది. పన్ను రాయితీల విషయంలో మాత్రం కొంత వెసులుబాటును జైట్లీ దగ్గర చేయవచ్చని అంచనా. ఇక ఆదాయం పెంచుకునేందుకు కేంద్రానికి ముందుగా కనిపించేది పొగాకు ఉత్పత్తులే. సిగరెట్లు, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తులపై, మద్యంపై సిన్ టాక్స్ ను మరింతగా పెంచే నిర్ణయం బడ్జెట్లో కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు దిగుమతి చేసుకునే లగ్జరీ వస్తువులపై ఎక్సైజ్ సుంకాల పెంపు నిర్ణయం సైతం వెలువడుతుందని అధికార వర్గాల సమాచారం. రేపు జైట్లీ చేసే ప్రసంగంపై మార్కెట్ వర్గాలు సైతం ఆసక్తిని చూపుతున్నాయి. ద్రవ్యలోటును ఎలా కట్టడి చేస్తారు? ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఏ మేరకు వంటి ప్రశ్నలకు జైట్లీ నుంచి వెలువడే సమాధానం సమీప భవిష్యత్తులో మార్కెట్ సూచికలకు దిశానిర్దేశమే.