: వైకాపాపై మరో దెబ్బ... ఎరగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు జంప్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన, ఆపై వైఎస్ఆర్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. మరికాసేపట్లో డేవిడ్ రాజు అధికారికంగా తెదేపాలో చేరనున్నారు. వెనుకబడిన నియోజకవర్గమైన ఎరగొండపాలెం అభివృద్ధిని కాంక్షించే తెలుగుదేశంలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా డేవిడ్ రాజు వ్యాఖ్యానించారు. అంతకుమించి మరేమీ వ్యాఖ్యానించబోనని అన్నారు. కాగా, టీడీపీ ప్రారంభించిన 'ఆపరేషన్ ఆకర్ష్' కొనసాగుతుండగా వైకాపా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎమ్మెల్యేలతో జగన్ స్వయంగా చర్చిస్తున్నా వలసలు ఆగకపోవడం గమనార్హం.