: ఇండియా పరిస్థితి ఆందోళనకరం: మోదీకి రాసిన లేఖలో 8 మంది అమెరికా సెనెటర్లు
ఇండియాలో మైనారిటీలపై జరుగుతున్న హింస నానాటికీ పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో 8 మంది అమెరికన్ సెనెటర్లు సహా 34 మంది వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులను కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని, నిందితులను శిక్షించాలని వారు కోరారు. "ప్రభుత్వం మైనారిటీల హక్కులను కాపాడేందుకు వెంటనే ముందుకు కదలాలి. హింసకు దిగుతున్న వారిని చట్టం ముందు నిలపాలి. భారత్ లో క్రిస్టియన్లు, సిక్కు, ముస్లిం వర్గాలపై దారుణాలు జరుగుతున్నాయి" అని 25వ తేదీతో రాసిన లేఖలో వారు ఆరోపించారు. ఈ లేఖను అమెరికన్ మానవ హక్కుల కమిషన్ మీడియాకు విడుదల చేసింది. దీనిపై సెనెటర్లు రాయ్ బ్లంట్, అమీ క్లోబుచర్, జేమ్స్ లాంక్ ఫోర్డ్, అల్ ఫ్రాంకెన్, టిమ్ స్కాట్, బెన్ సాసే, జాన్ బూజ్ మన్, స్టీవ్ డైనిస్ లతో పాటు మరో 24 మంది ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ దళ్ వంటి సంఘాల దుశ్చర్యలను అడ్డుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు. 2014, జూన్ 17న చత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో 50 గ్రామ పంచాయితీలు హిందూ మతం కానివారిని బహిష్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వీరి కారణంగా క్రిస్టియన్, ముస్లిం వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం సైతం కల్పించుకోలేదని ఆరోపించారు.