: ఢిల్లీ పర్మినెంట్ కాదు... గల్లీనే శాశ్వతం: నెల్లూరులో వెంకయ్య వ్యాఖ్యలు


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడి నోట మరోమారు ప్రాసతో కూడి ప్రసంగం వినిపించింది. నెల్లూరు జిల్లాలో జెన్ కో థర్మల్ పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఢిల్లీ పర్మినెంట్ కాదన్న ఆయన... గల్లీనే శాశ్వతమని ప్రకటించి నెల్లూరు జిల్లాను మరిచిపోనని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాను అందించగలుగుతోందన్నారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం ఏపీకి సహకారమందిస్తోందని వెంకయ్య చెప్పారు. ‘‘పంచాలంటే పెంచాలి... పెంచకుండా పంచితే ఏమీ మిగలదు. మంచి ఆలోచనలను ఆచరణలో పెడుతున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. రాష్ట్రానికి సీఎంగా సమర్థ నాయకుడిని ఎన్నుకోవడం ప్రజల అదృష్టం. ఏపీని విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఎల్ఈడీ బల్బుల వల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయి’’ అని వెంకయ్య అన్నారు.

  • Loading...

More Telugu News