: ఓయూలో హైటెన్షన్... ఎన్ సీసీ గేటు వద్ద విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మరోమారు హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. కొత్త రాష్ట్రం తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైన నేపథ్యంలో పాత పద్ధతికి వీడ్కోలు పలికిన కేసీఆర్ సర్కారు కొత్త విధానంతో ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విద్యార్థులు భగ్గుమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ దిశగా సాగుతున్న సర్కారు చర్చలకు నిరసనగా నేటి ఉదయం ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పోలీసు బలగాల మోహరింపును ఏమాత్రం లెక్కచేయని విద్యార్థులు ర్యాలీకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ర్యాలీగా ఎన్ సీసీ గేటు వద్దకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన పోలీసులు, పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.