: తెలంగాణలో ‘డబుల్’ ట్రబుల్!... ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు


కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే రెండు బెడ్ రూంలు, ఓ కిచెన్, టాయిలెట్లతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తామని ఆయన సగర్వంగా ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరవైంది. ఇప్పటికే మూడు సార్లు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు స్పందించడం లేదు. దీంతో పాలమూరు, వరంగల్ జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఈ పథకం దాదాపుగా నిలిచిపోయింది. చదరపు అడుగుకు రూ.900 ఇస్తామని ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే మార్కెట్ లో ఉన్న ధరల ప్రకారం ఈ రేటుకు ఇల్లు నిర్మించి ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్న కాంట్రాక్టర్లు బిడ్ల దాఖలుకు ముందుకు రావడం లేదు. ఈ ధరను ప్రభుత్వం పెంచితేనే తమకు గిట్టుబాటు అవుతుందని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. దీంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతానికి అవాంతరం ఎదురైందన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News