: ఇక్కడ చాలా మందిని కలుస్తున్నాను: దర్శకుడు వర్మ
గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ కొద్ది నిమిషాల క్రితం విజయవాడకు బయలు దేరారు. విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. తాను తెరకెక్కించనున్న ‘వంగవీటి’ సినిమాకు సంబంధించిన సమాచారం, వివరాలను సేకరించేందుకు మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉంటానని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన సమాచారం కోసం అవసరమైన అన్ని కుటుంబాలను కలవనున్నట్లు చెప్పారు. వాళ్లందరితో మాట్లాడిన తర్వాత అన్ని విషయాలను వెల్లడిస్తానన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఎయిర్ పోర్ట్ వద్దకు రావడంపై వర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం తాను తీస్తున్న సినిమా ఇక్కడి వాళ్లకు సంబంధించింది కావడంతోనే వారు తరలి వచ్చారన్నారు. విజయవాడ తనకు పుట్టిల్లు లాంటిదని అన్నారు. హోటల్ మురళీ ఫార్చూన్ లో బస చేయనున్న ఆయన దేవినేని, వంగవీటి కుటుంబాలతో పాటు రంగా అనుచరులను కూడా కలవనున్నట్లు సమాచారం.