: ప్రేమా, గీమా ఏం లేదు... అంతలోనే మాటమార్చిన హీరోయిన్ స్వాతి
తన తల్లిపై ఎలాంటి కేసు పెట్టలేదని, డబ్బు విషయమై చిన్న గొడవ మాత్రమే జరిగిందని హీరోయిన్ స్వాతిరెడ్డి ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్ లో స్వాతిరెడ్డి తల్లిపై చెయ్యి చేసుకున్న దృశ్యాలు, ఆపై పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడం, మద్యం సేవిస్తానని, సిగరెట్లు కాలుస్తానని అందరిముందూ చెప్పడం కెమెరాకు చిక్కి, టీవీ చానళ్లలో వస్తోందని తెలిసిందో లేక తల్లితో రాజీ కుదిరిందో గానీ, స్వాతి మాత్రం మాట మార్చింది. తన నుంచి తల్లి డబ్బులు ఆశించిందని, ఆ విషయంలో జరిగిన గొడవతోనే, ఏదో పేరు చెప్పి ఆమె స్టేషన్ గడప తొక్కిందని ఆరోపించిన స్వాతి, రాజీ కుదిరిందని, ఇక తాను మీడియాతో మాట్లాడలేనని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి వేయాలని వేడుకుంది. తాను ఎవరినీ ప్రేమించలేదని, తల్లి చెప్పిన శ్రీనివాస్ ఎవరో తెలియదని చెప్పింది. పెళ్లయిన వాళ్లతో తాను అఫైర్ ఎందుకు నడుపుతానని, తానింకా చిన్న పిల్లనని, ఎంతో భవిష్యత్తు ఉందని, మరో వ్యక్తి జీవితంలోకి వెళ్లి, ఇంకో యువతి జీవితాన్ని నాశనం చేసేంతదాన్ని కాదని అంది. శ్రీనివాస్ రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని, అంతకుమించి ఇంకే సంబంధం లేదని పేర్కొంది. తాను సంపాదిస్తున్నది అమ్మ కోసమేనని, ఆమె ఏదో పొరపాటున శ్రీనివాస్ పేరును ఫిర్యాదులో చెప్పివుండవచ్చని చెప్పింది. కాగా, స్వాతిరెడ్డి పొంతనలేని సమాధానాలు, వివరణలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరపాలని భావిస్తున్నట్టు సమాచారం.