: జగన్ ఈ రాష్ట్రానికి ఎప్పటికీ సీఎం కాలేరు: పయ్యావుల
వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఆ పార్టీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల పేరుతో అడుగడుగునా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పట్టిసీమను, ప్రజల రాజధాని అమరావతిని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఉపాధి కల్పించే బందర్ పోర్టు ససేమిరా కుదరదంటూ అడ్డుతగులుతున్నారని విమర్శించారు. చివరకు పనిచేసే ప్రభుత్వాన్ని కూడా కూలుస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, ప్రాంతాల పేరుతో రాష్ట్రాన్ని నిప్పుల కుంపటి చేస్తానంటున్నారని ధ్వజమెత్తారు. ఆయనేదో హస్త సాముద్రికాన్ని నమ్ముకుంటూ తానే సీఎం అవుతానని పిచ్చి భ్రమలో ఉన్నారని పయ్యావుల ఎద్దేవా చేశారు. '2019లో కాదు, నీ జీవితంలో కూడా ఈ రాష్ట్రానికి సీఎం కాలేవ'ని జగన్ పై నిప్పులు చెరిగారు. ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెచప్పుడుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంటుందన్నారు. వాటిన్నిటికంటే ముందు ప్రతిపక్ష నేతగా నిన్ను నీవు నిరూపించుకోవాలని, ప్రజా క్షేత్రంలో నీ బలమేంటో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. నీపై, నీ ఎమ్మెల్యేలపై, ప్రజలపై నమ్మకం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు నీవైపు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇదో మంచి అవకాశమని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పయ్యావుల సూచించారు.