: రింగింగ్ బెల్స్ మోసం చేసిందంటోన్న 'సై ఫ్యూచర్' కంపెనీ
ఫ్రీడమ్ 251 పేరుతో మొబైల్ రంగంలో సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ కంపెనీ తమను మోసం చేసిందని వీరికి హెల్ప్ లైన్ పార్టనర్ గా వ్యవహరిస్తున్న బీపీఓ కంపెనీ 'సై ఫ్యూచర్' ఆరోపిస్తోంది. తమకు చెల్లించాల్సిన కాంట్రాక్టు డబ్బులను ఇంతవరకు రింగింగ్ బెల్స్ చెల్లించలేదని ఆ కంపెనీ సీఈవో అనుజ్ బైరతి తెలిపారు. మొదటినుంచి తాము బెల్స్ పై, వారి వ్యాపార విధానంపై అనుమానాలతోనే ఉన్నామన్నారు. కానీ ఎన్నో చర్చల తరువాత వారి ప్రాజెక్టును తీసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఫోన్ లాంచ్ చేసిన కొన్ని రోజుల తరువాత తమ కాల్ సెంటర్ నంబర్ కు కస్టమర్ల నుంచి లక్షలాది కాల్స్ వచ్చాయని, వాటికి తాము బాగానే స్పందించామని వివరించారు. తమ సర్వీస్ కు రింగింగ్ బెల్స్ కూడా సంతోషం వ్యక్తం చేసిందన్నారు. అయితే తామెప్పుడైతే పేమెంట్ అడిగామో అప్పటినుంచి తమపై రింగింగ్ బెల్స్ తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిందని అనుజ్ తెలిపారు. దాంతో తమ సర్వీసులను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. కచ్చితంగా ఇది మోసం, ఒప్పంద ఉల్లంఘనే అవుతుందని ఆయన అన్నారు. కాగా, ఈ ఆరోపణలను రింగింగ్ బెల్స్ ఖండిస్తోంది.