: ట్విట్టర్ లో ‘కేజ్రీవాల్ సర్కస్’ హోరు!... ఢిల్లీ ముఖ్యమంత్రిపై నెటిజన్ల సెటైర్లు
ఢిల్లీ పొరుగు రాష్ట్రం పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ... ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా దృష్టి సారించింది. సాక్షాత్తు ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ‘‘మాకు అధికారం ఇస్తే... పంజాబ్ లోనూ ఢిల్లీ మోడల్ పాలనకు శ్రీకారం చుడతాం. అవినీతి భరతం పడతాం’’ అంటూ కేజ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిన్నటి నుంచి ఆయన పంజాబ్ లో ఐదు రోజుల సుడిగాలి పర్యటనను ప్రారంభించారు. ఈ క్రమంలో కేజ్రీ కామెంట్లపై నెటిజన్ల సెటైర్ల దాడి ప్రారంభమైంది. ‘కేజ్రీవాల్ సర్కస్’ పేరిట ట్విట్టర్ లో ప్రారంభమైన ప్రచారంలో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సదరు సెటైర్లలో ఓ సెటైర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘‘సీఎం అయ్యారు... పీఎంను నిందించారు. ఒకవేళ మీరు పీఎం అయితే ఏం చేస్తారు?... ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)ను నిందిస్తారు. ఫలితంగా ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయిం నిలిచిపోతుంది. ఐరాస నుంచి కూడా అదే తరహా రియాక్షన్ తప్పదు’’ అని ఆ సెటైర్ లో ఓ నెటిజన్ కేజ్రీ వైఖరిపై నిప్పులు చెరిగారు.