: వైకాపాకు దగ్గరవుతున్న చిరంజీవి!


ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అవుననే అనిపిస్తోంది. చిరంజీవి వైకాపాలో చేరుతున్నట్టు వార్తలు రాగా, వాటిని ఆయనే స్వయంగా ఖండించారు కూడా. అయినప్పటికీ, చిరంజీవి స్వగ్రామం మొగల్తూరు, పాలకొల్లులో జరిగిన సంఘటనలు, ఆపై కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలను పుట్టిస్తున్నాయి. ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు కూడా చెప్పకుండా ఆయన పర్యటన సాగడం, అంతకుమించి వైకాపా నేతలకు ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పడం, తన పర్యటనలో కాంగ్రెస్ నేతలను చేర్చనీయకుండా జగన్ బ్యాచ్ కి పెద్దపీట వేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేయనున్నామని కూడా తేల్చి చెప్పారు. కాగా, చిరంజీవి పర్యటనకు వస్తున్నారన్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలియకముందే, వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు వారం రోజుల ముందుగానే చెప్పేశారు. ఆయన వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారని చెప్పి, అందుకు ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకున్నారు. అయితే, అధికారికంగా వైకాపా నేతలు చిరంజీవి పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు బయటకు కనిపించకుండా, అది కాపు కులస్తుల కోసం అన్నట్టు చూపించడంలో విజయవంతమయ్యారు. ఈ ఘటనలే ఇప్పుడు కాంగ్రెస్ లో కలవరం పుట్టిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో కొనసాగుతున్న వివిధ పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చిరంజీవి పార్టీ మారుతారా? లేక కాంగ్రెస్ లోనే ఉంటారా? మరికొన్ని రోజుల్లో తేలుతుంది.

  • Loading...

More Telugu News