: జైలు స్నేహితులను తలచుకున్న సంజయ్... 500 కవితలు రాశానని వెల్లడి
జైలు జీవితం తననెంతో మార్చి వేసిందని ఎరవాడ జైలు నుంచి నిన్న విడుదలైన సంజయ్ దత్ వ్యాఖ్యానించాడు. జైల్లో కొంతమంది మిత్రులయ్యారని, వారిలో కవులు కూడా ఉండటంతో, వారిచ్చిన స్ఫూర్తితో తాను సైతం కవిత్వం రాశానని చెప్పాడు. ఇంటికి వచ్చిన తరువాత 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో ప్రత్యేకంగా మాట్లాడారు. మొత్తం 500 షాయరీలను రచించానని, వాటిని పుస్తకరూపంలో తీసుకువస్తానని చెప్పాడు. జైల్లో సమీర్, జీషాన్ లు తనకెంతో దగ్గరయ్యారని, సాజర్, గోటియా మామాలు కూడా మంచి మిత్రులని చెప్పుకొచ్చాడు. తన కొత్త హెయిర్ స్టయిల్ గురించి మాట్లాడుతూ, ఎరవాడ జైల్లోని మిశ్రాజీ అనే బార్బర్ తనకు అత్యుత్తమ హెయిర్ స్టయిల్ ను అందిస్తానని చెబుతూ, ఇలా తయారు చేశాడని అన్నాడు. తనకు జైల్లో పనిచేసినందుకు రూ. 440 వచ్చిందని, దాన్ని మాన్యతకు ఇచ్చానని చెప్పిన సంజయ్, డబ్బు విలువేంటో తనకు ఎరవాడ నేర్పిందని అన్నాడు.