: గీటు దాటిన మహిళలకు ఐసిస్ దారుణ శిక్ష...ఇనుప ముళ్లు చర్మంలోకి దిగుతాయి!
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల పేరు చెబితే ఇరాక్, సిరియాల్లో ముస్లిం మహిళల వెన్నులో వణుకు మొదలువుతోంది ఇప్పుడు. ఉగ్రవాదుల దారుణ శిక్షలు తలచుకుంటే వారికి కంటిపై కునుకు కూడా ఉండడం లేదు. తమ ఆదేశాలను పొరపాటుగానైనా ఆచరణలో మరిచారో అలాంటి మహిళలను క్లిప్పర్ అనే ఇనుప ఆయుధంతో దారుణంగా శిక్షిస్తారు. తమ శరీరాన్ని పూర్తిగా వస్త్రాలతో కప్పుకోని మహిళలను శిక్షించేందుకు ప్రత్యేకంగా ఉగ్రవాదులు క్లిప్పర్ అనే ఆయుధాన్ని వాడుతున్నారు. దీనితో శిక్షిస్తుంటే చర్మం వలుస్తున్నంత భయంకరంగా ఉంటోందని మోసుల్ నుంచి పారిపోయి బయటపడ్డ ఓ బాధితురాలు బాహ్య ప్రపంచానికి వెల్లడించారు. ఎన్నో ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఎట్టకేలకు మోసుల్ నుంచి బయటపడినట్టు ఫాతిమా అనే ఈ బాధితురాలు తెలిపింది. గతంతో పోలిస్తే ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పుడు మరింత క్రూరంగా మారినట్టు ఆమె అభిప్రాయపడింది. గ్లోవ్స్ మర్చిపోయి తన సోదరి బయటికి వచ్చినందుకు ఉగ్రవాదులు చాలా దారుణంగా శిక్షించినట్టు బయటపెట్టింది. నెల తర్వాత కూడా ఆ గాయాలు మానలేదని, మచ్చలు అలానే ఉన్నాయని పేర్కొంది. ఐసిస్ శిక్షించే సమయంలో కలిగిన నొప్పి ప్రసవ సమయంలో పడిన బాధ కంటే రెట్టింపుగా ఉందని తన సోదరి చెప్పినట్టు ఫాతిమా వెల్లడించింది. మహిళలు బురఖాతోపాటు పాదాలకు సాక్సులు, చేతులకు గ్లోవ్స్ ధరించాలని, బయటకు వచ్చారంటే వెంట తోడుగా మగవారు ఒక్కరైనా ఉండాలని ఐసిస్ ఈ మధ్య ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. మహిళలను శిక్షించే ఇనుప పనిముట్టు చివర ముళ్లతో ఉంటుందని, దానితో కొడితే ముళ్లు చర్మంలోకి దిగిపోతాయని ఫాతిమా వివరించింది. దీన్నిబట్టి ఐసిస్ ఉగ్రవాదుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం అవుతోంది.