: 'మేకిన్ ఇండియా వీక్' ప్రమాదం వెనుక పెను నిర్లక్ష్యం!


ఇండియాకు మరిన్ని పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా, మోదీ సర్కారు ముంబైలోని చౌపాటీ బీచ్ లో తలపెట్టిన 'మేకిన్ ఇండియా వీక్' వేదికపై ఈ నెల 14న జరిగిన ప్రమాదం వెనుక నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందని విచారణ కమిటీ తేల్చింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ సహా ఎంతో మంది వీఐపీలు, 10 వేల మంది అతిథులు సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తుండగా, మంటలు వ్యాపించి, వేదిక మొత్తం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడనప్పటికీ, దాదాపు 5 కోట్ల మేరకు విలువైన ఆస్తి నష్టం సంభవించింది. ఈ కార్యక్రమాన్ని విజ్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్ టెయిన్ మెంట్ నిర్వహించగా, సేఫ్టీ నిబంధనలను వారు పాటించలేదని, ఘటనపై విచారణ జరిపిన ఫైర్ డిపార్టు మెంట్ విచారణ తేల్చింది. స్టేజీ కింద సులువుగా నిప్పులను పెంచే సిలిండర్లను ఉంచారని, స్టేజ్ త్వరగా అంటుకునేలా కర్టెన్లు, మ్యాట్ ఫ్లోర్ లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు, మంటలను ఆర్పేందుకు ఎటువంటి ఏర్పాట్లనూ చేయలేదని ఆరోపించారు. నిప్పులతో వినాయకుడిని సృష్టించేందుకు పెద్దఎత్తున సిలిండర్లను స్టేజ్ కింద ఉంచారని విచారణ జరిపిన కమిటీ ఆరోపించింది. వాటి నుంచి వెలువడిన గ్యాస్ కూడా మంటలు పెరగడానికి కారణమని తేల్చింది. ఫైర్ ఎఫెక్టుల కోసం వాడిన విద్యుత్ తీగల కారణంగానే తొలుత మంటలంటుకున్నాయని, వాటిని వెంటనే గుర్తించి ఆర్పడంలో విఫలమయ్యారని నివేదిక ఇచ్చింది.

  • Loading...

More Telugu News